»10 Crore Cash In Hyderabad Alone In 3 Days 20 Kg Gold Seized
Elections: 3 రోజుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే రూ.10 కోట్ల నగదు.. 20 కేజీల బంగారం సీజ్
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. అయినప్పటికీ మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. మరో 8 కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు మొదలుపెట్టారు. ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచారు. అన్నిచోట్లా ముమ్మరంగా సోదాలు చేపడుతున్నారు. ఎటువంటి పత్రాలు, ఆధారాలు లేకుండా నగదు, బంగారం, వెండి, మద్యం, ఇతర వస్తువులను తరలిస్తుంటే వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం (Election Commission) అధికారులు కీలక హెచ్చరిక చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి మూడు రోజులు అవుతోందని, ఈ తరుణంలో 10 కోట్ల రూపాయల నగదును హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క బంజారాహిల్స్ ప్రాంతంలోనే రూ.3.35 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఎలాంటి పత్రాలు లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.7.5 కోట్లు ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.