హైదరాబాద్ హరిహర కళాభవన్‌లో క్రిస్టయన్ హక్కుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ కేంద్రమంత్రి చిదంబరం (Chidambaram) హాజరయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణపై చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)పై నిప్పులు చెరిగారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆరోపించారు. తెలంగాణకు వచ్చి మోదీ.. సీఎం కేసీఆర్‌ను తిడతారని, కేసీఆర్ తెలంగాణ మొత్తం తిరిగి మోదీని తిడతారని, కానీ వీరెవరూ తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడరని విమర్శించారు.
అన్ని రంగాల్లో తెలంగాణ ఆశించిన దాని కంటే వెనుకబడిందన్నారు. ప్రస్తుతం దేశంలో క్రైస్తవులు (Christians) ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని తెలిపారు. ముఖ్యంగా దేశంలో మతపరమైన స్వేచ్ఛ అణిచివేయబడిందని గుర్తుచేశారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రాలేదు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు వేరే ఉండేదని అన్నారు. ఎంతో అభివృద్ధిని జరిగి ఉండేదని.. ఇప్పుడు అదంతా ఒకే ఇంటికి పరిమితమైందని కీలక వ్యాఖ్యలు చేశారు.