»Hearing On Chandrababus Petition Today In Supreme Court Tension In Tdp Circles
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ..టీడీపీ వర్గాల్లో టెన్షన్!
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పిటీషన్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య పొలిటికల్ హీట్ ఎక్కువైంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆయన కుటుంబీకులు, టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కేంద్ర కారాగారంలో ఉన్న బాబును వెంటనే విడుదల చేయాలని టీడీపీ నేతలు ఢిల్లీలో దీక్షను చేపట్టారు.
మరోవైపు చంద్రబాబు ఇప్పటికే బెయిల్ క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా బెయిల్ పిటిషన్‌ను నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఇకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తనపై పెట్టిన కేసు కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ సాగనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండానే తనపై పెట్టిన కేసు కొట్టివేయాలంటూ సుప్రీం కోర్టులో చంద్రబాబు పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులోని 6వ నెంబర్ కోర్టులో ఐటెం నెంబర్ 63 కింద లిస్టయిన ఈ కేసును నేడు జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయనుంది. ఈ కేసులో సీఐడీ కూడా తన వాదనలను వినిపించే అవకాశం ఉంది.