Bandaru Satyanarayana Murthy: టీడీపీ నేత బండారు సత్యనారాయణ అరెస్ట్
మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో 41ఏ, 41బీ సెక్షన్ల కింద పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.
టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy)ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గుంటూరు పోలీసులు ఆయనపై రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మంత్రి రోజా (Minister Roja)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనకు నోటీసులిచ్చేందుకు యత్నించారు.
చంద్రబాబు అరెస్టు (Chandrababu arrest)కు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బండారు సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించే క్రమంలో ప్రైవేటు అంబులెన్స్‌ను రప్పించారు. ఆ సమయంలో అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు టీడీపీ (TDP) నేతలకు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది.
చివరికి బండారు సత్యనారాయణ ఇంటి తలుపులు బద్దలు కొట్టి నోటీసులిచ్చారు. 41ఏ, 41బీ సెక్షన్ల కింద ఆయనకు నోటీసులిచ్చినట్లు పోలీసులు తెలిపారు. మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు గుంటూరులో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేశారు.