చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నారా లోకేశ్ ఒక్క రోజు దీక్షను చేపట్టారు. ఈ రోజు సాయంత్రం ఆయన దీక్షను విరమించి మీడియాతో మాట్లాడారు. తమపై ఎన్నికేసులు పెట్టినా ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. క్వాష్ పిటిషన్ విచారణ తర్వాత టీడీపీ భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు.
టీడీపీ నేత నారా లోకేశ్ నేడు చేపట్టిన నిరాహార దీక్షను విరమించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. నేడు ఢిల్లీలో ఆయన ఒక్క రోజు దీక్షలో పాల్గొన్నారు. దీక్ష ముగించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో 2.15 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి అందులో 80 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అదంతా చంద్రబాబు చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్లనే సాధ్యమైందన్నారు.
చంద్రబాబు వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టి నేటికి 24 రోజులుగా రిమాండ్‌లో ఉంచారన్నారు. సైబరాబాద్ గానీ, అమరావతి గానీ, విశాఖపట్నం గానీ, రాయలసీమలో అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరును పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పిచ్చి జగన్‌కి అవేవీ అర్థం కావని మండిపడ్డారు.
స్కిల్ కేసులో చంద్రబాబుకు ఎక్కడ బెయిల్ వస్తుందోనని భయపడి ఆయనపై మరో మూడు కేసులను వైసీపీ నేతలు రెడీ చేశారన్నారు. బ్రాహ్మణిని, భువనేశ్వరమ్మను కూడా జైలుకు పంపించాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. టీడీపీ పోరాటం కొనసాగుతుందని, తగ్గేదే లే..అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతుందని, ఐటెం నెం.62 కింద ఆ పిటిషన్ వస్తోందని లోకేశ్ తెలిపారు. కోర్టు నిర్ణయాలను బట్టి తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు.