తెలంగాణ(Telangana)లో అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ(PRC)లో వారిని చేర్చాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించే పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రస్తుతం సమ్మెలో ఉన్న అంగన్వాడీ(Anganwadi)ల మెజార్టీ సమస్యలను తీర్చామన్నారు. మిగతా డిమాండ్లపై నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ కార్య దర్శిని ఆదేశించామన్నారు. మంత్రి హరీశ్‌రావును సీఐటీయూ (CITU), అంగన్వాడీ సంఘాల నేతలు ఆదివారం కలిశారు.ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70వేల మందికి ప్రయోజనం కలగనుంది.
మరోవైపు మధ్యాహ్న భోజనాని (Mid Day Meal)కి సంబంధించిన పెండింగ్ బిల్లులు సైతం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అంగన్వాడీ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు అంగన్వాడీల గురించి పట్టించుకోలేదని, అంగన్వాడి వర్కర్లుగా ఉన్న వారి పేరును అంగన్వాడి టీచర్లుగా గౌరవప్రదంగా ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చారని గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీల సంక్షేమంపై చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి.. తమ డిమాండ్లన్నింటిపై సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు. కాగా, సీఎం కేసీఆర్ నిర్ణయంపై అంగన్వాడీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు(Minister Harish Rao)కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ చర్చల్లో సిఐటియు ఏఐటియుసి యూనియన్ నాయకులు అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.