భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై కేంద్రం ప్రభుత్వం మరో భారం మోపింది.వాణిజ్య అవసరాలకు (Commercial) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధరను భారీగా పెంచింది. కమర్షియల్ సిలిండర్ ధరలను గతకొన్ని నెలలుగా 10, 20 రూపాయల మేర తగ్గిస్తూ వస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కసారిగా రూ.200 కుపైగా పెంచింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.209 పెరిగి రూ.1731.50కి చేరింది. ఇక కోల్కతాలో రూ.1839.50, చెన్నైలో రూ.1898, ముంబైలో రూ.1684గా ఉన్నది.
పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.కాగా, గృహ వినియోగదారులకు మాత్రం ధరల పెరుగుదల నుంచి ఊరటలభించింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (Domestic LPG cylinder) ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులేదని కంపెనీలు ప్రకటించాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో దాదాపు ఏడాది తర్వాత గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలింగర్ ధరను రూ.200 వేర కేంద్ర ప్రభుత్వం గత నెలలో తగ్గించిన విషయం తెలిసిందే. అయితే నెల తిరక్కముందే అంతే మొత్తాన్ని వాణిజ్య సిలిండర్లపై వసూలు చేయనుండటం గమనార్హం.
పండుగ సీజన్ ముందు సిలిండర్ ధరలు (Cylinder prices)పెరగడం వల్ల చాల మందిపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 209 మేర పెరిగింది. ఇక కోల్కతాలో అయితే సిలిండర్ ధర రూ. 203 దూసుకుపోయింది. అలాగే ముంబైలో అయితే సిలిండర్ ధర రూ.202 పెరిగింది. ఇక చెన్నై(Chennai)లో అయితే సిలిండర్ రేటు రూ. 203 మేర పైకి కదిలింది. 19 కేజీల సిలిండర్ ధరకు రేట్ల పెంపు వర్తిస్తుంది.మరోవైపు ఈ ధరలతో పాటు డెలివరీ ఛార్జీలు సైతం చెల్లించుకోవాల్సి వస్తోంది. దీంతో అదనపు భారం వినియోగదారులు భరించాల్సి వస్తోంది. డెలివరీ ఛార్జీలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నా వసూలు చేస్తున్నట్లు సమాచారం.