అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. మరో కీలక నేత దూరమయ్యారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ కసిరెడ్డి (MLC Kasireddy) నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. ఈ లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవితో కసిరెడ్డి భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ (BRS) టిక్కెట్టును ఆశించారు కసిరెడ్డి .అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కేసీఆర్ టిక్కెట్టును కేటాయించారు.దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.గత కొంతకాలం నుండి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ (Kalvakurti Assembly) స్థానం నుండి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
రెండు మూడు దఫాలు అనుచరులతో సమావేశమయ్యారు. గత మాసంలో బీఆర్ఎస్ టిక్కెట్లను కేసీఆర్ ప్రకటించారు.అయితే కల్వకుర్తి టిక్కెట్టు దక్కకపోవడంతో కసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ(Congress party)లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలోనే ఆయన గత వారంలో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు.ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్ లో చేరడానికి ముందు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే.