తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు(TMB) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎస్ క్రిష్ణన్ తన పదవికి రిజైన్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాన్ని రాజీనామా చేస్తున్నాట్లు ఆయన లేఖలో తెలిపారు. ఒక కారు డ్రైవర్ (Car driver) బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.9 వేల కోట్లు జమ అయిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.‘ఇంకా నా పదవీకాలం మిగిలి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పదవి నుంచి వైదొలుగుతున్నాను’ అని క్రిష్ణన్ (Krishnan) తెలిపారు. బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ రాజీనామాపై సమావేశం నిర్వహించి.. ఆమోదం తెలిపారు. అలాగే దీనిపై ఆర్బీఐకి సమాచారం ఇచ్చారు. 2022లో క్రిష్ణన్ తన బాధ్యతల్లోకి వచ్చారు.
చెన్నై(Chennai)లోని పళని నెయ్‌క్కారపట్టి గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి చెన్నైలోని కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తీసుకుని డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో రాజ్‌కుమార్ (Rajkumar) తన కారులో నిద్రిస్తుండగా అతని సెల్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ నుంచి రాజ్‌కుమార్ బ్యాంక్ ఖాతాలో రూ.9,000 కోట్లు జమ అయ్యినట్లు ఎస్ఎంఎస్లో కనిపించింది. ఈ మెసేజ్ చూడగానే రాజ్‌కుమార్ తీవ్ర భయభ్రాంతులకు గురయ్యాడు. అంత డబ్బు తన అకౌంట్లోకి ఎలా వచ్చిందో తెలియక తికమకపడ్డాడు. అసలు 9 వేల కోట్ల రూపాయలంటే ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా అతను ఊహించలేకపోయాడు.
తన బ్యాంకు ఖాతా(Bank Account)లో కేవలం 105 రూపాయలే ఉండగా ఇంత పెద్ద మొత్తం ఎలా వచ్చాయా? అని సందేహించాడు. అసలు ఇది నిజమా.. కాదా అని తెలుసుకునేందుకు అదే రోజు రాజ్ కుమార్ తన స్నేహితుడికి తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.21,000 బదిలీ చేశాడు. ఆ మొత్తాన్ని స్నేహితుడికి పంపిన తర్వాత తన బ్యాంకు ఖాతాలో 9 వేల కోట్ల రూపాయలు చేరడం నిజమేనని భావించి సంబరపడ్డాడు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే తమిళనాడు (Tamil Nadu) మర్కంటైల్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఉన్న తూత్తుకుడి నుంచి రాజ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. ఓ పొరపాటు వల్ల అతని బ్యాంకు ఖాతాలో రూ.9,000 కోట్లు జమ అయ్యాయని వారు తెలిపారు.ఆ డబ్బును ఖర్చు చేయవద్దని బ్యాంకు యాజమాన్యం కోరింది.స్నేహితుడికి పంపిన రూ.21 వేలు తిరిగి ఇవ్వాల్సిన పని లేదని, వాహన రుణం(Vehicle loan)ఇస్తామని బ్యాంకు వారు చెప్పినట్లు సమాచారం