»Rs 200 Crores In A Wage Account Without A Bank Account
viral: బ్యాంక్ అకౌంటే లేని కూలీ ఖాతాలో రూ.200 కోట్లు!
కూలి పని చేసుకునే వ్యక్తి బ్యాంకు అకౌంట్లోకి రూ.200 కోట్లు రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ వ్యక్తిని విచారించేందుకు వెళ్లగా చివరికి అతనికి బ్యాంకు అకౌంటే లేదని తెలిసి షాక్ అయ్యారు.
ఓ కూలీ బ్యాంకు ఖాతాలో రూ.200 కోట్లు వచ్చి పడ్డాయి. దాంతో హుటాహుటిన ఆ కూలీ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాను బ్లాక్ చేశారు. ఆ వ్యక్తిని ఆరా తీయగా అతనికి బ్యాంకు అకౌంటే లేదని చెప్పాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హర్యానాలోని చర్కీ-దాద్రీలో నివాసం ఉండే విక్రమ్ కూలి పనులు చేసేవాడు.
ఓ రోజు విక్రమ్ ఖాతాలోకి రూ.200 కోట్లు జమ కావడంతో కుటుంబీకులు భయాందోళన చెందారు. విక్రమ్‌ని పోలీసులు విచారించగా అతనికి బ్యాంకు అకౌంటే లేదని తెలిసింది. అయితే విక్రమ్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా పెద్ద మోసం జరుగుతోందని పోలీసులు అనుమానించారు. గుజరాత్ పోలీసులు ఆ ఖాతా ఉండే బ్యాంకును సంప్రదించారు. విక్రమ్ పేరుపై ఎవరో ఖాతా తెరిచారని, ఎవరో డబ్బులు డిపాజిట్ చేశారని తేలింది.
పోలీసులు విక్రమ్‌ను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ స్కాంలో విక్రమ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తుండగా వారి వద్ద ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకపోవడంతో గ్రామస్తులు అడ్డుపడ్డారు. తనకు డబ్బులు అవసరం లేదని, తనని తన కుటుంబాన్ని వదిలేయాలని విక్రమ్ పోలీసులను వేడుకున్నాడు. తమని సురక్షితంగా ఉండనిస్తే చాలని కోరాడు.