»Nalgonda Double Suicide Harassment Over Morphed Instagram Pic Suspected
Nalgonda Suicide: నల్గొండలో దారుణం..ప్రాణాలు తీసిన మార్ఫింగ్ ఫొటోలు!
డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతులు వాట్సాప్‌లో తమ ఫోటోలను డీపీలుగా పెట్టుకున్నారు. అయితే కొందరు ఆకతాయిలు ఆ ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో భరించలేకపోయారు. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
నల్గొండలో దారుణం జరిగింది. ఆకతాయిల వేధింపులకు యువతులు ప్రాణాలు తీసుకున్నారు. అమ్మాయిల వాట్సాప్ డీపీలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంతో మనస్తాపం చెంది ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు..మనీషా, శివాని అనే ఇద్దరు యువతులు డిగ్రీ చదువుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టారని మనస్తాపం చెంది రాజీవ్ పార్కులో ఆత్మహత్యాయత్నం చేశారు.
గడ్డి మందు తాగి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారిని స్థానికులు నల్గొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ప్రాణాలొదిరారు. బాధితులు ఇద్దరూ నార్కట్ పల్లి మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చిన్నతనం నుంచి ఫ్రెండ్స్‌గా ఉన్న మనిషా, శివానీలు తమ ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకున్నారు. అయితే ఆ ఫోటోలను కొందరు ఆకతాయిలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
అసభ్యంగా ఉన్న తమ ఫోటోలను చూసి యువతులు మనస్తాపం చెందారు. ఇద్దరూ పార్క్‌కి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. వైద్యులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. యువతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మృతుల తల్లిదండ్రులు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతులను బ్లాక్మెయిల్ చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.