యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mallu Bhatti Vikramarka : యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిపూజలో సీఎం రేవంత్ దంపతులు పాల్గొన్నారు. ఆయనతో పాటు డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, కొండా సురేఖ ఎత్తు పీటలపై కూర్చొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పీట లేకపోవడంతో ఆయన కింద కూర్చుకున్నారు. భట్టి విక్రమార్క, కొండా సురేఖ కింద కూర్చోవడం వివాదాస్పదం అయ్యింది.
దళితుడు కాబట్టే ఆయనను కింద కూర్చో బెట్టారని బీఆర్ఎస్, బీఎస్పీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ ఫొటోను ఎక్స్ లో ట్వీట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్… దేవుడి సాక్షిగా డిప్యూటీ సీఎంకు అవమానం జరిగిందన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్..సోమవారం మీడియాతో మాట్లాడారు. రెడ్డి నాయకుల దగ్గర దళిత బిడ్డకు అవమానం జరిగిందన్నారు. ఎస్సీ నేతను కింద కూర్చోబెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ కొండా సురేఖను సైతం కింద కూర్చోబెట్టారని ఆరోపించారు. దేవుడి దళిత, బీసీ బిడ్డలకు ఇంత ఘోర అవమానం జరిగితే వాళ్లు ఎవరికి చెప్పుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన భట్టి విక్రమార్కను ఉద్దేశపూర్వకంగానే అవమానించారంటూ బాల్క సుమన్ ఆరోపించారు. 74 ఏళ్ల స్వాతంత్ర భారతంలో దళితులకు ఘోర అవమానాలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్దేశపూర్వకంగా భట్టి విక్రమార్క ఫొటో పక్కన పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.