ఓ వైద్యుడి నిర్లక్ష్యంతో ఇద్దరు నవజాత శిశువు (Newborn baby) మృతి చెందారు. హాయిగా నిద్రపోవడానికి డాక్టర్ ఏసీ వేసుకోగా.. ఆ చలికి తట్టుకోలేక ఇద్దరు శిశువులు మరణించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్(UP) లోని శామలి జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి కారణమైన డాక్టర్ నీతును పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కైరాణా ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)లో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించారు. వీరిద్దరిని ఫొటోథెరపీ (Phototherapy) యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు.
ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు (Family members)వెళ్లేసరికి.. విగతజీవులయ్యారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.చిన్నారుల కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా వైద్యుడిపై ఐపీసీ సెక్షన్ (IPC Sec) 304 కింద కేసు నమోదుచేసినట్టు కైరానా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేత్రపాల్ సింగ్ తెలిపారు. డాక్టర్ నీతును అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆరోగ్య శాఖ దీనిపై విచారణకు ఆదేశించింది. అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వనీ శర్మ (Ashwani Sharma) మాట్లాడుతూ.. ఈ కేసులో దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు, మెడికల్ డిగ్రీ, లైసెన్స్ లేకుండా డాక్టర్ నీతు క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించామని చెప్పారు. క్లినిక్‌ను సీల్ చేశామని, వైద్యుడిపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం సెక్షన్ 15 (2,3) కింద కేసు నమోదుచేశామన్నారు.