ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట కవిత హాజరు కావాలంటూ ఇటీవల ఆమెకు ఈడీ (ED) నోటీసులు పంపింది. అయితే, ఈడీ పంపిన సమన్లు రద్దు చేయాలంటూ కవిత సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీ(CRCC)కి విరుద్ధమని కవిత వాదిస్తున్నారు. నళిని చిదంబరం (Nalini Chidambaram) తరహాలోనే తనను ఇంటి వద్దే విచారించాలని కవిత కోరుతున్నారు. కవిత పిటిషన్ ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించబోతోంది. ఈడీ దర్యాప్తులపై నళినీ చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ(Abhishek Banerjee)లు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి కవిత పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు విచారించబోతోంది.
మరోవైపు సుప్రీంకోర్టులో ఈడీ ఈరోజు అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేశ రాజధాని అయిన ఢిల్లీలో మద్యం (Delhi Liquor) దుకాణాలు మొదట ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. వాటిని ప్రైవేటుకు అప్పగిస్తూ.. 2020 సెప్టెంబర్లో ఆప్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోజు ఆప్ తీసుకున్న ఈ నిర్ణయమే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆప్ సర్కార్ (AAP Govt) నిర్ణయం మేరకు.. 2021 జనవరి 5న లిక్కర్ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంలో ఓ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాశ్ గెహ్లాట్ (Kailash Gehlot) ఈ బృందంలో ఉన్నారు. అయితే.. వాళ్లంతా కలిసి.. రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని ఆప్ సర్కార్.. మే 21, 2021న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది.