చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ మేరకు ఆయన్ని సీఐడీ కోర్టులో హాజరుపరచనుంది. కోర్టులో చంద్రబాబు కస్టడీని పొడిగించాలని సీఐడీ కోరనుంది. ఏసీబీ కోర్టులో సీఐడీ పిటీషన్ కూడా దాఖలు చేయనున్నట్లు సమాచారం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సహకరించారో లేదో అన్న దానిపై నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి ఇవ్వాలని కోర్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆదివారం సాయంత్రం చంద్రబాబుతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి మాట్లాడనున్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్, రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో సర్వత్రా చర్చ నెలకొంది. విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా జైలులోనే ఆయన్ని సీఐడీ విచారించింది.
2 రోజుల కస్టడీలో చంద్రబాబును 12 గంటల పాటు సీఐడీ విచారించింది. 120కి పైగా ప్రశ్నలను అడిగింది. చాలా ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా దాటవేసినట్లు సమాచారం. చంద్రబాబుకు వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. అయితే రిమాండ్ పొడిగించే అవకాశం కూడా ఉంది. సీఐడీ ఈ మేరకు న్యాయమూర్తిని కోరితే కోర్టు పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.