»Rahul Gandhi Assam Cid Summons Congress Leader Rahul
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కి అస్సాం సీఐడీ సమన్లు!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. గత నెల భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాహుల్ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. గత నెల భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ యాత్ర సమయంలో గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయంలో రాహుల్ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై రాహుల్‌ను సీఐడీ విచారించనుంది.
ఈ కేసుకి సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్‌తో పాటు సీనియర్ నేతలు కేసీ వేణు గోపాల్, జితేంద్ర సింగ్, జైరాం రమేశ్, శ్రీనివాస్ బీవీ, కన్హయ్య కుమార్, గౌరవ్ గొగొయ్, భూపేన్ కుమార్ బోరా, దేబబ్రత సైకియా పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి పలువురు నేతలకు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయి. ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ సిక్దార్‌తో పాటు మరో పార్టీ నేతకు కూడా అస్సాం పోలీసులు నోటీసులు ఇచ్చారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గువహటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ట్రాఫిక్ కారణాలు దృష్ట్యా నగరంలో దీనికి ప్రభుత్వం అనుమతి నిరాకరించి బైపాస్ ద్వారా వెళ్లాలని సూచించింది. దీనికోసం ప్రభుత్వం బారికేడ్లను ఏర్పాటు చేశారు. వీటిని తొలగించి కాంగ్రెస్ కార్యకర్తలు ముందు వెళ్లారు. దీంతో పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలను రాహుల్ రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ఇటీవల సీఐడీకి బదిలీ చేశారు.