Red Sea: ఎర్రసముద్రంలో అలజడులు కొనసాగుతూనే ఉన్నాయి. యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు నౌకలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో నౌకలపై దాడిచేశారు. తాజాగా ఓ భారీ నౌకపై దాడిచేశారు. దీంతో అందులో ఉన్న సిబ్బంది ఆ నౌకను అక్కడే వదిలివెళ్లిపోయారు. ఇలా దాడులు జరిగిన తర్వాత నౌకను వదిలి వెళ్లిపోవడం ఇదే మొదటిసారి. బెలిజ్ జెండా ఉన్న రూబీమార్ నౌకపై హూతీలు రెండు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అందులోని సిబ్బంది నుంచి వచ్చిన ప్రమాద హెచ్చరికలకు ఒక యుద్ధనౌక, మరొక వ్యాపార నౌక స్పందించాయని తెలిపింది.
రూబీమార్ ఒక చిన్న నౌక. దీని రిజిస్ట్రేషన్ ఇంగ్లాండ్‌లో నమోదైంది. ఈ దాడుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన నౌక పూర్తిగా మునిగిపోయిందని హూతీ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలీదు. గతేడాది నవంబర్ నుంచి హూతీలు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగానే ఇవి చేపడుతున్నామని చెబుతున్నారు. వీటిని నిలిపివేసే వరకు ఈ దాడులు కొనసాగుతాయని ప్రకటించారు.