ఐఆర్‌సీటీలో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కొనుక్కుంటే అది కన్ఫమ్ కాదు. అలాంటప్పుడు మన డబ్బులు రోజుల తరబడి రిఫండ్ రావు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఐఆర్సీటీసీ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది. అదేంటంటే...
IRCTC iPay Autopay : భారతీయ రైళ్లలో టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా ప్రయాస పడాల్సి ఉంటుంది. కొన్ని సార్లు రైల్వే టికెట్ బుకింగ్ కాదు. కొన్ని సార్లు అయినా వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. రైలు బయలుదేరే ముందు ఛార్ట్ ప్రిపేర్ అయ్యే టైంకి కొన్ని సార్లు టికెట్ కన్ఫమ్ కాదు. ఇలాంటప్పుడు మన డబ్బులు రోజుల తరబడి రిఫండ్ రావు. ఇకపై ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది.
ఐఆర్సీటీసీ ‘ఐపే ఆటోపే’ (IRCTC iPay Autopay) పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఛార్జీ చెల్లించకుండానే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత డబ్బులు చెల్లించొచ్చు. దీంతో టికెట్ కన్ఫమ్ కానప్పుడు మనం డబ్బులు కోల్పోయే పరిస్థితి ఉండదు.
ఐఆర్సీటీసీలో టికెట్ కొనుక్కునేప్పుడు మనకు ఎన్నో రకాల పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఐపే అనే ఐఆర్సీటీసీ సొంత పేమెంట్ గేట్‌వే కనిపిస్తుంది. iPay పేమెంట్ గేట్‌వేకు ఉన్న ప్రత్యేక ఫీచర్ ఆటోపే. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎక్కువ విలువ కలిగిన టికెట్లను కొనుక్కోవాలని అనుకున్నప్పుడు దీని ద్వారా పేమెంట్ చేయడం వల్ల కొంత సౌలభ్యం ఉంటుంది. ఇలా ఆటోపే ఆప్షన్ ఉపయోగించి టికెట్ బుక్ చేసినప్పుడు డబ్బులు కట్ కావు. అయితే ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతా నుంచి ఖర్చు చేయడానికి వీలు పడదు. టికెట్ కన్ఫమ్ అయితే అవి కట్ అయిపోతాయి. లేదంటే మీ బ్యాంకు ఖాతాలోనే ఉండిపోతాయి. వాటిపై నియంత్రణను ఐఆర్సీటీసీ ఎత్తివేస్తుంది. దీంతో రిఫండ్ కోసం ఎదురు చూడాల్సిన అవస్థలు తప్పుతాయి.