»Jayalalitha Illegal Assets Case Jewellery Hand Over To Tamilnadu Government
Jayalalitha Gold Jewellery : జయలలిత ఆ నగలన్నీ తమిళనాడు ప్రభుత్వానివే : కోర్టు
కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వెండి వస్తువులు, ఇతర వస్తువులు తమిళనాడు ప్రభుత్వానివే అని బెంగళూరు కోర్టు స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే...
Jayalalitha Gold Jewellery : తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు సంబంధించిన కొన్ని ఆభరణాలు, వస్తువులు కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలో జయ లలిత నివాసం ఉంటున్న ఇంటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు వారికి పెద్ద ఎత్తున బంగారు వజ్రాభరణాలు, విలువైన వస్తువులు దొరికాయి. అయి అప్పటి నుంచి కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. అవి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వమే తీసుకోవాలని కర్ణాటకలోని బెంగళూరు కోర్టు ఆదేశించింది. అందుకు ఆరు ట్రంకు పెట్టెల్ని తెచ్చుకోవాలని సూచించింది.
మార్చి 6,7 తేదీల్లో 6 ట్రంకు పెట్టెలతో వచ్చి ఆభరణాల్ని తీసుకు వెళ్లాలని(Jewellery Hand Over) తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి 6,7 తేదీలను ప్రకటిస్తూ, ఆ రెండు రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు. న్యాయమూర్తి దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు.
‘ఆ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలి. తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోనేలా చర్యలు తీసుకోవాలి’ అని న్యాయమూర్తి తెలిపారు. అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు ఇలా ఉన్నాయి. 7,040 గ్రాముల 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు; 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. వాటితో పాటు 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్లు, 1 వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, రూ.1,93,202 నగదును స్వాధీనం చేసుకున్నారు.