»Irctc Refunds To Get Faster Passengers To Get Money Back In One Hour Report
IRCTC : ఇలా జరిగితే గంటలోనే ఐఆర్సీటీసీ రిఫండ్
సాధారణంగా ఐఆర్‌సీటీలో టికెట్ బుకింగ్ చేస్తే కొన్ని సార్లు టికెట్ బుక్ అవ్వదు. కానీ అకౌంట్లో డబ్బులు మాత్రం కట్ అయిపోతుంటాయి. అలా కట్ అయిన డబ్బులు రెండు రోజులకు గాని అకౌంట్లో జమ కావు. అయితే ఈ సమస్యకు ఇప్పుడు ఐఆర్సీటీసీ స్వస్తి పలికింది. వివరాల్లోకి వెళితే..
IRCTC : ఐఆర్సీటీసీలో టికెట్ బుకింగ్ అంటే ఒక పెద్ద ప్రహసనమే అన్నట్లు ఉంటుంది. చాలా ఎక్కువ మంది వినియోగించే సైట్ కాబట్టి ఇబ్బందులూ అదే స్థాయిలో ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి టికెట్ బుక్ చేస్తే అది బుక్ కాదు. కానీ అందుకు సంబంధించిన డబ్బులు మాత్రం అకౌంట్ నుంచి కట్ అయిపోతుంటాయి. అవి మళ్లీ రిఫండ్(refund) రావడానికి రోజుల సమయం పడుతుంది. అయితే ఇలా జరిగితే మాత్రం ఇక నుంచి ఒక గంట సేపటి లోనే అకౌంట్లోకి తిరిగి డబ్బులు జమ అవుతాయని ఐఆర్సీటీసీ ప్రకటించింది.
ఇటీవల కాలంలొ రిఫండ్ల విషయంలో ఐఆర్సీటీసీకి(IRCTC) పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే మిగిలిన రిఫండ్ల(refund) జారీకి పడుతున్న సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఐఆర్సీటీసీకి ఐటీ సేవలు అందించే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS)కి మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఈ సంస్థ ప్రస్తుతం దీనిపై పని చేస్తోంది.
టికెట్ బుక్ కాని సందర్భంలో రిఫండ్ ప్రాసెస్‌ని ఐఆర్సీటీసీ సాధారణంగా మరుచటి రోజు ప్రారంభిస్తుంది. అది బ్యాంకుకు చేరి పేమెంట్ గేట్ వే ద్వారా ఖాతాదారుడి అకౌంట్లో జమ అవడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుంది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి టికెట్ క్యాన్సిల్ అయినా కూడా ఇదే జరుగుతుంది. దీంతో ఎక్కువ రోజులు పడుతుంది. ఇప్పుడు మనుషులతో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా అన్నీ జరుగుతున్నా ఇలా రిఫండ్లు ఎందుకు ఆలస్యం అవుతున్నాయన్న విషయం మీద ప్రస్తుతం రైల్వే శాఖ దృష్టి సారించింది. ఈ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇస్తోంది.