Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యింది. దీంతో మహిళలకు అసెంబ్లీ, పార్లమెంటులో 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే 2029 ఎన్నికల్లో ఈ బిల్లు అమలు కానుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలుపడంతో దేశం అంతటా సంబరాలు నెలకొన్నాయి. బిల్లుకు అనుకూలంగా 454 మంది ఓట్లు వేశారు. అయితే వ్యతిరేకంగా ఇద్దరు ఓటు వేశారు. నిన్న దిగువ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై ఈ రోజు సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చ సాగగా బిల్లుపై 60 మంది సభ్యులు తమ మాటలను వినిపించారు. ఆఖరిలో అమిత్ షా బిల్లుపై అందరికీ సమాధానం ఇచ్చారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. ఈ బిల్లును తొలుత ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా ఆమోదించాలని నిర్ణయించినప్పటికీ సాంకేతిక సమస్య కారణంగా ఆ తర్వాత సభ్యులకు స్లిప్పులు ఇచ్చి ఓటు వేయించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులు ఇచ్చి ఓటింగ్ నిర్వహించగా ఆ ఓటింగ్ సమయంలో 456 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు చట్టసభల్లో అంటే అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీలో 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో ఈ రిజర్వేషన్ అమలు కాదని, 2029 ఎన్నికల్లో అమలవుతుందని నేతలు తెలిపారు.