స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఈ స్కామ్ జరగడానికి ప్రధాన సూత్రధారి చంద్రబాబే అని పేర్కొంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement scam case)లో ముఖ్య సూత్రధారి చంద్రబాబే (chandrababu) అని సీఐడీ (CID) తన రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపింది. స్కిల్ స్కామ్‌లో బాబుకు పూర్తి అవగాహన ఉందని తెలిపింది. బాబు ఆదేశాల మేరకే డబ్బులు విడుదలయ్యాయని సీఐడీ వెల్లడించింది. రిమాండ్‌లో నారా లోకేష్ పేరును కూడా చేర్చింది. కిలారి రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్ట్ (Remand report)లో తెలిపింది.
కేబినెట్ (Cabinet) తీర్మానాలను పట్టించుకోకుండా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో కొత్త శాఖలను ఏర్పాటు చేశారని, ఎలాంటి ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండానే సీమెన్స్ సంస్థ ఇచ్చిన డీపీఆర్ ఆధారంగా రూ.3,281 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ ముందు పెట్టినట్లు సీఐడీ తెలిపింది. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు, అచ్చెన్నాయుడు అప్రూవ్ చేశారని, 98 శాతం ఖర్చు సీమెన్స్ భరిస్తుందని అప్పట్లో కేబినెట్‌కు అబద్దాలు చెప్పినట్లు సీఐడీ రిపోర్ట్ తెలిపింది.
బ్యాంకు గ్యారెంటీ లేకుండానే సర్కార్ రూ.371 కోట్లను డిజైన్‌టెక్ (Designtech) సంస్థకు ఇచ్చిందని, అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి కే.సునీత అభ్యంతరాలను కూడా పట్టించుకోలేదని సీఐడీ ఆరోపించింది. పలు షెల్ కంపెనీల ద్వారా డిజైన్‌టెక్ కంపెనీ రూ.279 కోట్లను దారిమళ్లించినట్లు సీఐడీ రిపోర్టులో పేర్కొంది. ఈ కుట్రపై జీఎస్టీ విచారణ మొదలవ్వగానే నిందితుల నోట్ ఫైల్స్ మాయం చేశారని, కేబినెట్ లో అత్యవసర ఐటమ్ కింద పెట్టి ప్రపోజల్‌ను ఆమోదించినట్లు సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్ట్‌ను ఏసీబీ కోర్టు (ACB Court)కు సమర్పించింది.