Viral news: నిజామాబాద్ జిల్లా(Nizamabad) నవీపేట్ మండలం యంచా గ్రామ పంచాయతీ అల్జా పూర్ శివారులో చిరుత(Leopard) తిరుగుతున్నట్లు గ్రామస్తులు భయాందోళన చెందారు. అదే విషయాన్ని అటవీశాఖ అధికారులకు చెప్పగా.. తీవ్ర ప్రయత్నం తరువాత ఎంతో చాకచక్యంగా దాన్ని బోనులో బంధించారు. అటవీ శివారు ప్రాంతంలో చిరుత కనిపించిందని మేకలను తింటుందని సంబంధిత గ్రామ సర్పంచ్ ఫోన్ ద్వారా శుక్రవారం తెలపడంతో నిజామాబాద్ రేంజ్ అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.
శనివారం డీఎఫ్ ఓ వికాస్ మీనా సమాచారం అందించి దాని జాడలు కనుక్కొని రెండు బోనులను ఏర్పాటు చేశారు. బోనులలో ఉన్న ఎర కోసం వచ్చిన చిరుతను శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఇదే విషయాన్ని నార్త్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మ రావు తెలిపారు. సమాచారాన్ని హైదరాబాద్ లోని జూపార్క్ అధికారులకు అందించగా సాయంత్రం వచ్చి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఈ చిరుత వయసు సుమారు రెండు సంవత్సరాలు ఉంటుందని, దీనికి ఎలాంటి గాయాలు కాలేదని, ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. అటవీ శివారు ప్రాంతాలలో వన్యప్రాణుల సంచారం గురించి అటవీ శాఖకు సమాచారం అందించాలని ఫారెస్ట్ అధికారులు కోరారు. వన్యప్రాణుల నుంచి ప్రజలను కాపాడేందుకు చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.