శంషాబాద్ చుట్టుపక్కల చిరుత పులి సంచరిస్తోంది. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో ఈ పులిని బంధించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.
Leopard : శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిరుతపులి కలకలం సృష్టిస్తోంది. ఇటీవల అది ఓ కుక్కపై దాడి చేసినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ మధ్య కాలంలో శంషాబాద్ విమానాశ్రయం దగ్గర్లో ఓ చిరుత పులిని పట్టుకుని అధికారులు బంధించి తీసుకెళ్లారు. మళ్లీ ఇప్పుడు మరో చిరుతపులి అక్కడ సంచరిస్తోంది. ప్రజల్ని భయ భ్రాంతులకు గురి చేస్తోంది. దీంతో దీన్ని పట్టుకునేందుకు అధికారులు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
శంషాబాద్(Shamshabad) మండలం ఘాన్సిమియాగూడలో( Ghansimiaguda) పలు చోట్ల ట్రాప్ కెమేరాలను ఏర్పాటు చేశారు. పది కెమేరాలకు అక్కడక్కడా ఏర్పాటు చేసి చిరుత కదలికల్ని గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు మూడు బోన్లను సైతం ఏర్పాటు చేశారు. బోన్ల సహాయంతో వీలైనంత తొందరగా చిరుతను బంధించి తీసుకెళతామని అధికారులు చెబుతున్నారు.
మేనెలలో కూడా ఇలాగా శంషాబాద్ విమానాశ్రయం దగ్గర చిరుతపులి ఒకటి సంచరించింది. దాని కూడా రెండు పిల్లలు కూడా ఉన్నాయి. ఓ రోజు గొల్లపల్లి వద్ద ఎయిర్పోర్ట్(Airport) ప్రహారీ నుంచి చిరుత దూకింది. విమానాశ్రయ ఫెన్సింగ్ వైర్లకు తగులుకుంది. దీంతో ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూంలో అలారం మోగింది. అప్రమత్తం అయిన సిబ్బంది అటవీ అధికారులకు సమాచారం అందించారు. రెండు రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు ఆ చిరుతను వారు బంధించారు. ఇప్పుడు మళ్లీ మరో చిరుత కనిపించడం చర్చనీయాంశంగా మారింది.