భారత అంతరిక్ష సంస్థ ఇస్రో (ISRO) మరో శుభవార్త చెప్పింది. చంద్రునిపైకి చంద్రయాన్-3ని ప్రయోగించి ఇస్రో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రుని దక్షిణ ధృవంపై ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) పలు మూలకాల మిశ్రమాలను గుర్తించినట్లు తెలిపింది. మూలకాలను పరిశోధించేందుకు ప్రజ్ఞాన్ రోవర్లో లేజర్-ఇండ్యుసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (LIBS) పరికరాన్ని ఇస్రో అమర్చింది.
ఎల్ఐబీఎస్ (LIBS) పేలోడ్ ను బెంగళూరులోని ఇస్రో (ISRO) ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్‌లో శాస్త్రవేత్తలు (Isro Scientists) అభివృద్ధి చేశారు. దక్షిణ ధృవంపై ఎల్ఐబీఎస్ మొట్టమొదటి శాస్త్రీయ పరిశోధన చేయగా నేడు చంద్రునిపై సల్ఫర్ ఉన్నట్లు తేల్చింది. అంతేకాకుండా శాస్త్రీయ సాంకేతికత ఆధారంగా పలు మూలకాలను రోవర్ (Rover) గుర్తించింది.
ప్రజ్ఞాన్ రోవర్ (Pragyan Rover) చేసిన పరిశోధనలో చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో అల్యూమినియం (Al), సల్ఫర్ (S), కాల్షియం (Ca), ఐరన్ (Fe), క్రోమియం (Cr), టైటానియం (Ti) ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. అలాగే, మరికొన్ని గణాంకాల ద్వారా మాంగనీస్ (Mn), సిలికాన్ (Si), ఆక్సిజన్ (O) ఉనికి ఉన్నట్లు ఇస్రో గుర్తించినట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం హైడ్రోజన్ ఉనికి గురించి రోవర్ పరిశోధిస్తోందని ఇస్రో (ISRO) తెలిపింది.