తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం ముందుకు సాగుతోంది. 90 సీట్లను టార్గెట్‌గా పెట్టుకున్న కమలదళం కనీసం 65 స్థానాలు దక్కించుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ సీట్ల కోసం వరుసగా సమావేశాలు, భేటీలు నిర్వహిస్తోంది. సోమవారం ప్రారంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాల్లోను తెలంగాణ నేతలకు దిశానిర్దేశనం చేసింది. అసెంబ్లీలో గెలుపు, ఆ తర్వాత లోకసభ ఎన్నికల్లో 12 సీట్లను టార్గెట్ చేస్తోంది. తెలంగాణలో బీజేపీ గత ఎన్నికల కంటే చాలా బలపడింది. ఇదే దూకుడుతో, వ్యూహాలతో ముందుకు సాగాలని సూచించింది.
తెలంగాణలో బలపడేందుకు, ప్రజల అటెన్షన్ కోసం బీజేపీ అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రధాని మోడీ పాలమూరు లోకసభ నుండి పోటీ చేస్తారని గత కొద్దిరోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీకి పట్టు కోసం తమిళనాడులోను రామనాథపురం, ఆ తర్వాత పాలమూరు నుండి పోటీకి దించాలని అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా, పాలమూరు నుండి అమిత్ షా పేరు కూడా వినిపిస్తోంది. ఉత్తరాది బీజేపీని రెండుసార్లు గట్టెక్కించింది. మూడోసారి ప్రభుత్వ వ్యతిరేకత సహజం. అందుకే ఈసారి మోడీ, అమిత్ షా కన్ను దక్షిణాదిపై పడింది. అక్కడ తగ్గే సీట్లను కర్నాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి దక్కించుకోవాలని చూస్తున్నారు.
ఇందులో భాగంగా పాలమూరు నుండి తొలుత మోడీ పేరు, ఇప్పుడు అమిత్ షా పేరు వినిపిస్తోంది. అయితే పోటీపై ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఓ నిర్ణయానికి రాకపోయినప్పటికీ… అంతర్గతంగా చర్చలు మాత్రం జరుగుతుండవచ్చు. వీరిద్దరు ఇక్కడి నుండి పోటీ చేస్తారనే సంకేతాలు ఉంటే తెలంగాణలో తమ బలం మరింత పెరుగుతుందని ఢిల్లీ నుండి గల్లీ వరకు పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇది 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో లబ్ధి చేకూర్చవచ్చు. వారు పోటీ చేస్తారని భావించే లోకసభ ఎన్నికలు 2024 ఏప్రిల్, మే నెలల్లో వస్తాయి. పోటీ చేసినా, చేయకపోయినా.. ముందైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రచారం ప్రభావం ఉంటుంది.
మోడీ, అమిత్ షా వంటి నెంబర్ 1, నెంబర్ 2 నేతలు తెలంగాణ నుండి పోటీ చేస్తారనే వాదన పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతుంది. ప్రజల అటెన్షన్‌ను కూడా కమలం వైపు నడిపిస్తుంది. ఇది బీజేపీకి అదనంగా ప్రయోజనం చేకూర్చే అవకాశాలే ఎక్కువ. పోటీ విషయానికి వస్తే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి పోటీపై నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి దక్షిణాది నుండి పోటీ చేసే అవకాశాలే ఎక్కువ. మూడేళ్లలోనే తెలంగాణలో ఇంతగా ఎదిగిన బీజేపీ, ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడితే ఢిల్లీ పెద్దల మరోవైపు చూడవచ్చు. అధికారంలోకి రాకపోయినా, ప్రతిపక్ష హోదా దక్కించుకున్నా.. అప్పుడు పాలమూరు వైపు చూసే అవకాశాలు ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన ఈ మేజిక్, లోకసభ సమయంలో మరింత ఊతమిస్తుంది.