Re-releases: సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడి చాలా మంది ఇండస్ట్రీకి(Film Induatry) వస్తుంటారు. టెక్నిషీయన్లు మాత్రమే కాదు డబ్బులు పెట్టే నిర్మాతలు ఎదగాలని అనుకుంటారు. ఫస్ట్ చిన్న టీమ్‌తో.. తక్కువ బడ్జెట్లో సినిమా నిర్మించి అంచలంచెలుగా ఎదగాలని చూస్తారు. అందుకు తగ్గ కథను, సాంకేతిక నిపుణులను ఎంచుకొని కొంత మొత్తం అనుకొని చిత్రాన్ని నిర్మించే పనిలో నిమగ్నం అవుతారు. మధ్యలో వచ్చే కారణాలతో బడ్జెట్ పెరుగుతుంది. సినిమా మీద ప్రేమతో ఎదగాలన్న ఆశతో ఫైనాన్స్ తెచ్చి సినిమాను పూర్తి చేస్తారు. ఇక అక్కడి నుంచి అసలైన కష్టాలు మొదలవుతాయి. సినిమా రిలీజ్ చేయడం తలకు మించిన భారం. కథ బాగుంది అని ఎన్నిసార్లు చెప్పినా కొనే వాడు రాడు, ఆఫీసుల చుట్టు తిరిగినా ఫలితం శూన్యం.. పైగా విడుదల కావల్సిన సినిమాల లిస్ట్ చూపిస్తారు. ఇక డిస్ట్రిబ్యూటర్లు (Distributers) అయితే సినిమా బడ్జెట్ నుంచి మొదలు పెట్టి ప్యాడింగ్ యాక్టర్ల వరకు నానా బేరీజులు వేసి చూసుకుంటారు. అది వారి బిజినెస్ స్ట్రాటజీ. ఇవీ కాకుండా మరొ విధానంలో సినిమాను విడుదల చేయవచ్చు. డైరెక్ట్ ఎగ్జిబిటర్లతో మాట్లాడి థియేటర్ల (Theater)ను రెంట్లకు తీసుకొవచ్చు. ఇలా చేసినా కనీసం తమ సినిమా ప్రేక్షకుల వరకు చేరింది అనే సంతృప్తి ఉంటుంది. అది కూడా ఇప్పుడు అసాధ్యంగా మారింది. వింటేజ్ సినిమాలకు 4కే రిజల్యూషన్‌తో రీరిలీజ్ చేయడం. ప్రస్తుతం ఇది ట్రెండ్‌గా మారింది. హీరో పుట్టిన రోజు, సినిమా విడుదల రోజులను పురస్కరించుకొని సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చిన్న సినిమాలకు శాపంగా మారింది.
చిన్న సినిమాలు విడుదలవడం కొంచెం కష్టమే.. ఓల్డ్ సినిమాలు రీరిలీజ్‌లతో థియేటర్లు దొరకగా అసలు విడదలవడం గగనంగా మారింది. చేసేదేమీ లేక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఫైనాన్షియర్లకు సమాధానం చెప్పలేక, వడ్డీ భారంతో గుండెపోట్లు తెచ్చుకుంటున్నారు. మాములుగా రీరిలీజ్ అనేది ఏ సినిమాలు లేని సమయంలో ఏదైనా సూపర్ హిట్ సినిమాను విడుదల చేస్తే బాగుంటుంది. అప్పట్లో డిజాస్టర్ అయిన సినిమాలను కూడా రీరిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాలను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వీటి కింద నలిగిపోయే చిన్న సినిమాలను పట్టించుకునే నాథుడే లేడు. వీటికి తోడు ఫ్యాన్ వార్స్. మా హీరో సినిమా ఇంత కలెక్ట్ చేసిందంటే మా స్టార్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందని గొడవలు. వచ్చే డబ్బులను మంచి పనుల కోసం వాడుతున్నారు.. పరిశ్రమను నమ్ముకొని సినిమాలు తీసిన చిన్న నిర్మాతల గోడు ఎవరు పట్టించుకుంటారు. ఈ మధ్య నిర్మాతకు గుండెపోటు వచ్చి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఖుదీరంబోస్ అనే చిత్రాన్ని నిర్మించారు. అది ఎక్కడ ప్రదర్శించిన మంచి స్పందన వచ్చింది. థియేటర్లో విడుదల చేద్దాం అంటే మాత్రం హాల్స్ ఖాళీగా లేవు. అలాంటి టైమ్‌లో తీవ్ర ఒత్తిడికి గురైన ప్రొడ్యూసర్ విజయ్ జాగర్లముడి గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యారు. అదేరోజు ప్రభాస్ ప్లాప్ సినిమా మళ్లీ విడుదలైంది. అభిమానుల ఉత్సాహానికి థియేటర్లో కుర్చీలు, తెరలు కూడా చిరిగిపోయాయి.
ఈ ఏడాదిలో అందరూ పెద్ద హీరోల సినిమాలు రీరిలీజ్ (Re-release) అయ్యాయి. ఎప్పటి నంచో విడుదలకు నోచుకొని సినిమాలు థియేటర్లు దొరక్క పాతబడిపోతున్నాయి. మహేష్ బాబు నటించిన ఒక్కడు చిత్రం నుంచి మొదలైన ఈ తంతు పోకిరి, బిజినెస్ మ్యాన్, ఆయన ప్లాఫ్ సినిమా ఖలేజా.. పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమా నుంచి మొదలు పెడతే జల్సా, ఇప్పుడు సెప్టెంబర్‌లో ఆయన పుట్టిన రోజున విడుదలకు సిద్దం అయిన బద్రి, ప్లాఫ్ సినిమా గుడుంబాశంకర్ ఈ లిస్ట్‌లో ఉంది. ప్రభాస్, అల్లు అర్జున్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున ఇలా పదుల సంఖ్యలో ఉన్న స్టార్ల సినిమాలు విడుదలయ్యాయి. చిన్న సినిమాలు విడుదలైనవి చాలా తక్కువ. ఇలాగే కొనసాగితే పెద్ద హీరోల సినిమాలు, వాళ్ల పాత సినిమా సంబరాలు తప్ప చిన్న సినిమాలు రావు, అవి తీయడానికి నిర్మాతలు ముందుకు రారు. ఇప్పటికైన వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్మాతల కమిటీ మాట్లాడుకోవాలని సినీ విమర్శులు అభిప్రాయం వ్యర్తం చేస్తున్నారు.