ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొలిటికల్ అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఫైర్ అయింది. ప్రకటనల పేరుతో ప్రజాధనం ఖర్చు పెట్టారని.. పదిరోజుల్లో రూ.163.62 కోట్లు చెల్లించాలని లేదంటే తదుపరి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేసింది. జరిమానా కట్టకపోతే.. చట్టప్రకారం ముందుకు వెళ్తామని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కి నోటీసులు అందజేసింది. పార్టీ ఆస్తులను జప్తు చేసేందుకు కూడా వెనుకాడమంటూ హెచ్చరికలు జారీ చేసింది డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని సీజ్ చేస్తామంటూ వచ్చిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను కూడా నోటీసుల్లో ప్రస్తావించింది.
ప్రభుత్వ ప్రకటనల ముసుగులో ఆమ్ ఆద్మీ తన పార్టీ ప్రకటనలను చేసిందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. ఆ ప్రకటనల ఖర్చులను కేజ్రీవాల్ నుండి వసూలు చేయాలని ఢిల్లీ చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. ఇందుకు గానూ.. ఆప్ మొత్తం రూ.163 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఇందులో రూ.99.3 కోట్లకు పైగా మార్చి 31, 2017 వరకు ప్రకటనల మీద ఖర్చు చేశారని, మిగతా రూ.64 కోట్లు ఖర్చు చేసిన దానికి వడ్డీగా వసూలు చేయాలని తాజా నోటీసుల్లో పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రులను లక్ష్యంగా చేసుకొని ఈ నోటీసులు వచ్చాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారులను బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్లు మిస్ యూజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ పత్రికల్లోను బీజేపీ ముఖ్యమంత్రుల ప్రకటనలు వచ్చాయని, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. మరి బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా నోటీసులు జారీ చేస్తారా? అని సిసోడియా ప్రశ్నించారు. దీనికి బీజేపీ కూడా ఘాటుగానే స్పందించింది. వారు ప్రజల డబ్బును పార్టీ ప్రచారం కోసం ఉపయోగించుకున్నందుకు దానిని కట్టవలసిందే. జరిమానా కట్టకుండా.. విక్టిమ్ కార్డును ఉపయోగించవద్దని బీజేపీ అధికారిక ప్రతినిధి షెహ్జాద్ జైహింద్ కౌంటర్ వేశారు.