తన అందం పైన కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు ప్రముఖ సినీ నటి సమంత గట్టి కౌంటర్ ఇచ్చారు. సోమవారం నాటి శాకుంతలం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆమె పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమె చాలా రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ, శక్తిని కూడదీసుకొని ఆమె ట్రైలర్ లాంచ్‌కు రావడం గమనార్హం. ఆమె మాటల్లో, చేతల్లో ఆరోగ్య పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లోను ఓ నెటిజన్ ఆమె అందంపై కామెంట్ చేశారు. దీనికి నటి కూడా మంచి కౌంటర్ ఇచ్చారు. ఆమె సమాధానంపై నెటిజన్లు కూడా హర్షం వ్యక్తం చేశారు. అదిరిపోయే పంచ్ ఇచ్చారంటూ కితాబిచ్చారు.
సదరు నెటిజన్ సమంతను చూస్తే జాలేస్తోందని, ఆమె అందం తగ్గిపోయిందని, విడాకుల తర్వాత ఆమె ఎంతో దృఢంగా బయటకు వచ్చారని, కెరీర్లో ఉన్నతస్థానంలో ఉందని భావిస్తుండగానే, మయోసైటిస్ ఆమెకు కోలుకోలేని విధంగా మారి, బలహీనురాలిని చేసిందని జాలీ చూపించారు. దీనిపై సమంత స్పందిస్తూ… నాలా కొన్ని నెలల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదని కోరుకుంటున్నానని, మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను పంపిస్తున్నానని కౌంటర్ ఇచ్చారు.
ఈ స్పందన అదరగొట్టిందని, చెప్పుతో కొట్టినట్లుందని నెటిజన్లు కామెంట్ చేశారు. సూపర్ షాట్ మేడమ్, తంతే అక్కడ పడింది అని ఓ నెటిజన్, మహిళల పట్ల ఇలాంటి వెకిలి జాలి సరికాదని, సమంత మంచిగా చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారని మరో నెటిజన్, సదరు నెటిజన్ తీరు దారుణంగా ఉందని, సమంత గారు, అలాంటి వాటిని మీరు పక్కన పెట్టండి అంటో ఇంకో నెటిజన్ కామెంట్ చేశారు.