YS Jagan: భారతదేశంలోనే తొలిసారిగా అన్ని ప్రైవేట్ కంపెనీల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది. పారిశ్రామిక యూనిట్లు, ఫ్యాక్టరీలు, జాయింట్ వెంచర్లతో పాటు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఉన్న అన్ని వర్గాలలోని ప్రైవేట్ సంస్థలు స్థానిక అభ్యర్థులకు 75% ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ఎన్నికల హామీల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ హామీ ఇచ్చి నెరవేర్చారు. కొత్త చట్టం ప్రకారం స్థానిక అభ్యర్థులకు ఉద్యోగంలో నైపుణ్యం లేనట్లయితే కంపెనీలు, ప్రభుత్వ సహకారంతో అవసరమైన శిక్షణను అందించాలి. స్థానిక జనాభా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ఈ హామీని తీసుకొచ్చారు.
దీనిపై ప్రైవేటు పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని మంగళవారం సీఎం కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. ఈమేరకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. ఉద్యోగ కల్పన విషయం పై ఎప్పటికప్పుడు కలెక్షర్లు సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీ ఆరు నెలలకు సీఎంవోకు తమ నివేదిక పంపాలని ఆదేశించారు. స్థానికులకు ఉద్యోగావకావాశాలు లభిస్తాయనే ఉద్దేశంతోనే పరిశ్రమల స్థాపనలో ప్రైవేటు యాజమాన్యాలకు అండగా ఉంటున్నామని సీఎం వివరించారు. ఒక పరిశ్రమ సవ్యంగా నడవాలంటే ఆ ప్రాంతంలోని స్థానికుల మద్దతు చాలా అవసరం అన్నారు. ఇప్పటికే ఏర్పాటైన పరిశ్రమలతో పాటు నిర్మాణంలో ఉన్నవి.. కొత్తగా రాష్ట్రానికి రాబోతున్న కంపెనీల్లో ఉద్యోగ నియామకాల్లో స్టానికులకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. రాష్ట్రంలో మానవ వనరులకు కొరత లేదని జగన్ తెలిపారు.