Boris Johnson and Carey couple have another child at a late age.
Boris Johnson: బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్(59), కేరీ(35) దంపతులకు గత వారం మగపిల్లాడు పుట్టాడు. ఈ విషయాన్ని కేరీ మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పెళ్లికి ముందే వీరిద్దరు కొన్నాళ్లు సహజీవనం చేశారు. 2021లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు వివాహానికి ముందే ఓ అబ్బాయి పుట్టగా, ఇపుడు పుట్టిన బాబు మూడో సంతానం. ఏప్రిల్ 2020లో విల్ఫ్ జన్మించగా.. డిసెంబర్ 2021లో రోమీ జన్మించాడు. అయితే బోరిస్‌కు మటుకు ఈ అబ్బాయి 8వ సంతానం. గతంలో ఇద్దరు భార్యల ద్వారా ఈయనకు అయిదుగురు పిల్లలు పుట్టారు. తన కుమారుడికి స్వాగతం చెబుతూ మురిసిపోయిన కేరీ.. తాము అనుకొన్న కొన్ని పేర్లను వెల్లడిస్తూ ఇందులో నా భర్త ఏ పేరును ఎంపిక చేస్తారో ఊహించగలరా అంటూ ప్రశ్నించారు. బోరిస్ దంపతులు అనుకొన్న పేర్లలో గ్రీకు రాజు ఒడీసియస్ పేరు కూడా ఉండడం విశేషం.
బోరిస్ జాన్సన్ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్ ఓవెను వివాహం చేసుకున్నారు. అయితే 1993లో వారిద్దరూ విడిపోయారు. వీరికి సంతానం కలగలేదు. 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్ ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్-వీలర్ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం ఆర్ట్ కన్సల్టెంట్ హెలెన్ మాకిన్టైర్ తో ఎఫైర్ కారణంగా బోరిస్‌కు మరో బిడ్డ ఉన్నాడు. దీంతో మొత్తం బోరిన్ కు 8 మంది సంతానం.