ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తోట చంద్రశేఖరా, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి, టీజే ప్రకాశ్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు తదితరులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలో దేశమంతా వెలుగులతో నిండిపోతుందని, యావత్ దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సంక్రాంతి పండుగ తర్వాత పార్టీ పరుగు పెడుతుందన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపివేస్తామని, ఎల్ఐసీని ప్రభుత్వపరం చేస్తామన్నారు. బీఆర్ఎస్ ఏ ప్రాంతానికో, ఓ ప్రాంతానికో, ఓ భాషకో, ఓ వ్యక్తికో పరిమితం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు కేసీఆర్, టీఆర్ఎస్(బీఆర్ఎస్గా మారకముందు) తెలంగాణకే పరిమితం. కానీ ఇప్పుడు బీఆర్ఎస్గా మారి జాతీయ పార్టీగా మార్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలో తాము ఒక ప్రాంతానికి పరిమితం కాదని చెబుతున్నారు. తద్వారా ఏపీలోను పోటీ చేస్తామని, చాలామంది నేతలు తమ పార్టీలో చేరుతారని చెబుతున్నారు.
ఓ వైపు ఏపీ నుండి పలువురు టీఆర్ఎస్లో చేరుతుండగా, మరోవైపు వైసీపీ నుండి కొంతమంది ఏపీ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మంత్రులు రోజా, కొడాలి నాని, పేర్ని నాని వంటి వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ ఎక్కడైనా పోటీ చేయవచ్చునని, కేసీఆర్‌కు దేశంలో ఎక్కడికైనా తన పార్టీని విస్తరించుకునే హక్కు ఉన్నదని చెబుతూనే, అసలు విభజనకు కారణం కేసీఆర్ అని గుర్తు చేశారు. ఈ విభజనపై తమ ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారని, అలాంటప్పుడు వారిని ఎలా ఆదరిస్తారో చెప్పాలని నిలదీశారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలనే జీర్ణించుకోలేని పరిస్థితి అని, సరే వాటిని పక్కన పెట్టి విభజన హామీలు నెరవేరేందుకైనా కనీసం ఆయన సహకరించారా చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
శ్రీశైలం జలాశయం నీళ్లు, విద్యుత్, ఆస్తుల పంపకాల అంశాలు ఇప్పటికీ తెగలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు సరైన సహకారం లేకపోవడం వల్లే ఈ సమస్యలు పరిష్కారం కాలేదని అంటున్నారు. అనేక పెండింగ్ పనులను మొదట క్లియర్ చేసి, ఆ తర్వాత ఏపీలో అడుగు పెట్టవచ్చునన్నారు. ఏపీపై చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు కేసీఆర్ ఏం చేస్తారో చెప్పాలని నిలదీస్తున్నారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య ఎన్నో చిక్కులు ఉన్నాయని, వాటిని పరిష్కరించి ముందుకు సాగాలన్నారు. ఇదిలా ఉండగా, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఏపీలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. సంక్రాంతి తర్వాత ఏపీ బీఆర్ఎస్ కార్యాలయం తన ప్రగతి భవన్ కంటే రద్దీగా మారుతుందన్నారు.