తొమ్మిదేండ్లలో మీరు చూసింది ట్రైలరే (trailer) అని అసలు సినిమా ముందు ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. హైదరాబాద్ నానక్రామ్గూడలో క్రెడాయి కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫోక్ సింగర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ సాయిచంద్(Saichand)కు నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో జరిగిన ఎన్నికల్లో 63 సీట్లే వచ్చాయి.
ఒక్క 10 మందిని అటు ఇటు చేస్తే వెంటనే ప్రభుత్వం ఆగమైతది.. తెలంగాణ ఫెయిల్డ్ ఎక్సపర్మెంట్ అవుతదని తెలంగాణ వ్యతిరేకులు చాలా ప్రయత్నాలు చేశారు.’ అని గుర్తు చేశారు. ‘కొంతమంది రాజకీయ నాయకులకు క్లారిటీ ఉండకపోవచ్చు.. కానీ ప్రజలకు క్లారిటీ ఉంటుంది. జేబులో 100 నోటు ఉంటే.. దాని కింద పడేసి.. రోడ్డు మీద చిల్లర నాణేలు (Coins) ఎవరూ ఏరుకోరు. అలాగే మంచిగ పనిచేసే ప్రభుత్వాన్ని పిచ్చోళ్లు కూడా వదులుకోరు. కాబట్టే మొదటి ఎన్నికల్లో 63 సీట్లతో గెలిస్తే.. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో గెలిచాం. 2023లో జరిగే ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తామని సంపూర్ణ విశ్వాసం ఉంది.’ అని ధీమా వ్యక్తం చేశారు. 60 ఏండ్లలో కాని పనులు తొమ్మిదేండ్లలో పూర్తికావడానికి సమర్థవంతమైన సీఎం కేసీఆర్ (CMKCR) నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు.