ప్రతిపక్ష టీడీపీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా నెల్లూరు వైసీపీలో విభేదాలు ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. రూప్ కుమార్ ఎమ్మెల్యే అనిల్‌కు బాబాయ్ అవుతారు. అయినప్పటికీ వారి మధ్య పొసగడం లేదు.
రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని రూప్ కుమార్ అనుచరుడి భవనం మెట్లు తొలగించడం బాబాయ్-అబ్బాయ్ మధ్య వివాదాన్ని మరింత పెంచింది. వీటిని తొలగించేందుకు మంగళవారం అధికారులు రాగా, రూప్ కుమార్ అడ్డుకున్నారు. అయితే బుధవారం ఉదయం ఆ మెట్లను తొలగించారు. తన అనుచరుడికి చెందిన మెట్లు తొలగించడంతో రూప్ కుమార్ ఆగ్రహోద్రుడవుతున్నారు. అనిల్ కుమార్ తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని అంటున్నారు.
మరోవైపు, గూడురులో వైసీపీలోను విభేదాలు రాజుకున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ తీరుపై జెడ్పీటీసీ, ఎంపీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సచివాలయ కన్వీనర్ పదవుల విషయంలో తమను సంప్రదించలేదని వీరు ఆవేదన చెందుతున్నారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా జెడ్పీటీసీ యామిని రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారట. జెడ్పీటీసీతో పాటు తాము కూడా రాజీనామాలు చేస్తామని ఎంపీటీసులు కూడా చెబుతున్నారు. అంతకంటే ముందు ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లాలనుకుంటున్నారు.