రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ ఒకే పార్టీలో ఉండిపోరు. ఏ పార్టీలో ఉంటే తమకు ప్రయోజనం చేకూరుతుందా అని నిత్యం బేరీజులు వేసుకుంటూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే అలవాటు చాలా మందిలోకి ఉంటుంది. అలా పార్టీ మారిన తర్వాత అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అనవసరంగా పార్టీ మారి తప్పు చేశామనే భావన కూడా కొందరికి కలుగుతుంది. ఇలా భావనే ఓ వైసీపీ కార్యకర్తకు కలిగింది. తాను టీడీపీ నుంచి వైసీపీలోకి మారి తప్పు చేశానంటూ టీడీపీ నేత పరిటాల సునీత కాళ్లు పట్టుకొని మరీ ఆ కార్యకర్త క్షమాపణలు చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇదేం ఖర్మ – మన రాష్ట్రానికి అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. తాజాగా రాప్తాడు మండలం మరూరు పంచాయతీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానికులతో మమేకమై సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో ఓ వైసీపీ కార్యకర్త వచ్చి ఆమె కాళ్ల మీద పడటం గమనార్హం.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీ లో చేరి తప్పు చేశానమ్మా అంటూ రాప్తాడు మండలం ముచ్చుమర్రికి చెందిన రామాంజనేయులు మాజీ మంత్రి పరిటాల సునీత కాళ్లపై పడ్డారు. ఈ తప్పు చేసినందుకు తనను మన్నించాలంటూ ఆమె కాళ్లు పట్టుకున్నారు. మాజీ మంత్రి ఆయన్ను పైకి లేపి ఆప్యాయంగా పలకరించారు. ఆయన్ను ఇంటికి తీసుకెళ్లి మాట్లాడారు. గతంలో జరిగిందేదో జరిగిందని.. టీడీపీలో ఎప్పటికీ ‘మీలాంటి’ వాళ్లకు చోటుంటుందని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పరిటాల సునీత. ఇక నుంచి పార్టీ కోసం నిర్విరామంగా పనిచేస్తానని రామాంజనేయులు పరిటాల సునీతకు చెప్పారు.