వంగవీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపిందని..మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. గుడివాడలో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. వంగావీటి రంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని కొడాలి నాని అన్నారు. గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు.
‘తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వంగావీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపింది. వంగవీటి రంగా చావుకు టీడీపీనే కారణం. రంగాను రాజకీయంగా ఎదుర్కొలేకే చంపేశారు. రంగా పేరు చెప్పుకోకుండా రాజకీయం చేయలేని దుస్థితి టీడీపీది’ అని విమర్శలు గుప్పించారు.
రంగా చావుకు కారణమైన వ్యక్తులు కూడా ఈ రోజు ఆయన బూట్లు నాకుతున్నారంటూ.. టీడీపీ నేతలపై నోరు చేసుకున్నారు. రంగా హత్య కేసులో ముద్దాయిలు టీడీపీలోనే ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ హత్యలో చంద్రబాబు, టీడీపీ నేతల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. “రంగా హత్య కేసులో దేవినేని ఉమ, వెలగపూడి రామకృష్ణ ముద్దాయిలు. నేను టీడీపీలో ఉన్నప్పుడు రాధాను కలిస్తే చంద్రబాబు క్లాస్ పీకాడు. ఇప్పుడు అదే టీడీపీ ఆయన కోసం పాకులాడుతోంది” అని కొడాలి చెప్పారు.