దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన ఘనత ప్రధాని మోదీ (PM MODI) దక్కుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) అన్నారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కాం, లిక్కర్ స్కాం జరుగుతోందని ఆరోపించారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయిందని, శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని జేపీ నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి (Srikalahasti) పట్టణంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
సీఎం జగన్ (CM JAGAN) ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందని విమర్శించారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడంలేదని నడ్డా ఆరోపించారు. రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. ప్రధాని మోదీ ఎప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని, దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు ఆయన మొగ్గుచూపారని నడ్డా అన్నారు. ఏపీకి ప్రధాని మోదీ ఏంచేశారో రాష్ట్ర నేతలు వివరించారని నడ్డా చెప్పారు. దేశంలోని 50 కోట్ల మందికి మోదీ సర్కారు రూ.5 లక్షల బీమా సౌకర్యం (Insurance facility) కల్పిస్తోందని తెలిపారు. ప్రజల చికిత్సల కోసం కేంద్రం రూ.80 వేల కోట్లు ఖర్చుచేసిందని అన్నారు. ఉజ్వల పథకం(Ujvala pathakam)కింద 9 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసినట్టు ఆయన వివరించారు.