»Health Tips Cities Not As Good For Healthy Growth Of Kids Says Global Study Does Urban Access Still Have An Advantage Here
Health Tips: పిల్లల ఆరోగ్యానికి పల్లెలే మేలా? లేక పట్టణాలా?
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లోనే నివసించాలని ఆశపడుతున్నారు. పల్లెల్లోని మట్టివాసననను ఎవరూ ఆస్వాదించడం లేదు. పట్టణాల్లోని సౌకర్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇదంతా పిల్లలు, యుక్త వయసువారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా? అసలు పిల్లల ఆరోగ్యానికి, అభివృద్ధికి పల్లెలు బెటరా లేక.. పట్టణాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
పిల్లలు, యుక్తవయస్కుల ఆరోగ్యకరమైన పెరుగుదల, అభివృద్ధిపై నగరంలో నివసించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో తగ్గిపోతున్నాయని ఓ పరిశోధనలో తేలింది. దాదాపు 71 మిలియన్లకు పైగా పిల్లలపై చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. 1,500 మంది పరిశోధకుల కన్సార్టియం 1990 నుండి 2020 వరకు 200 దేశాలలో నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఐదు, 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి ఎత్తు , బాడీ మాస్ ఇండెక్స్ (BMI) డేటాను విశ్లేషించింది.
భారతదేశంలో, మొత్తం ప్రయోజనం ఇప్పటికీ పట్టణ కేంద్రాలలో ఉన్నప్పటికీ, ఇది ప్రపంచ పథాన్ని అనుసరిస్తోంది. భారతదేశంలో, పట్టణ కేంద్రాల్లో నివసించడం వల్ల ఆరోగ్య ప్రయోజనం ఇంకా ఉంది, అయితే ఫలితాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవట. ఉదాహరణకు, కేరళ వంటి రాష్ట్రాన్ని పరిశీలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో విద్య , ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు బాగానే ఉన్నాయి, తక్కువ కాలుష్యం, జనాభా తక్కువగా ఉండటం వలన గ్రామీణ ప్రాంతాల్లో నివసించడానికి ప్రయోజనం ఉంటుంది. పైగా పట్టణాల్లో ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండటం నయమని అక్కడి వారు భావిస్తున్నారట.
నగరాలు మెరుగైన విద్య, పోషకాహారం, క్రీడలు, వినోదం, ఆరోగ్య సంరక్షణ అవకాశాలను అందించడంతో, కొన్ని సంపన్న దేశాలలో మినహా మిగిలిన అన్నింటిలో 20వ శతాబ్దంలో నగరాల్లో నివసిస్తున్న పాఠశాల-వయస్సు పిల్లలు, యుక్తవయస్కులు వారి గ్రామీణ ప్రత్యర్ధుల కంటే ఎత్తుగా ఉన్నారని పరిశోధన కనుగొంది. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఎత్తులో వేగవంతమైన మెరుగుదలల ఫలితంగా చాలా దేశాలలో ఈ పట్టణ ఎత్తు ప్రయోజనం తగ్గిపోయింది. అనేక అధిక-ఆదాయ పాశ్చాత్య దేశాలలో, ఇది చిన్న పట్టణ-ఆధారిత ప్రతికూలతగా మారింది. నగరాలు, పట్టణాలలో ఉండేవారే ఎక్కువగా ఆస్తమా, అలర్జీలు, డిప్రెషన్లాంటి వాటితో బాధపడుతుంటారు. అయితే నగరాలలో కాలుష్యం, నేరాలు, ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా, గ్రామాలతో పోలిస్తే అక్కడ కొన్ని లాభాలున్నాయి. గ్రామాల మాదిరి కాకుండా పట్టణాలలో అంటువ్యాధులు, పురుగు పుట్రా గొడవ ఉండదు.
ఇక కాలుష్యం విషయాన్ని చూస్తే… కాలుష్యం కారణంగా ఎక్కడ ఎక్కువ మంది మరణిస్తున్నారు? మీ జవాబు పట్టణాలు అయితే మాత్రం మీరు తప్పు. చాలా దేశాలలో మరీ ప్రత్యేకించి భారతదేశంలో కాలుష్యం కారణంగా గ్రామాల్లోనే ఎక్కువగా మరణిస్తున్నారని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఉదాహరణకు 2015లో కాలుష్యం కారణంగా దేశంలో సుమారు 25 లక్షల మంది మరణిస్తే, వారిలో 75 శాతం మంది పల్లెల్లో ఉండేవారే. దీనికి కారణం గ్రామాల్లో పంట కోత అనంతరం వాటిని తగలబెట్టడం, పిడకలను కాల్చడం వంటి కారణాల వల్ల అక్కడ వాతావరణంలో కాలుష్యం పెరుగుతోంది. అంటే, ఎక్కడ ఉండే లాభాలు అక్కడ ఉన్నాయి. ఎక్కడ ఉండాల్సిన నష్టాలు అక్కడ ఉన్నాయి.