సిరిసిల్లలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీ రామారావు తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై స్పందించారు. అయితే ప్రతిపక్ష నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసి, సవాల్ విసిరిన ఐదారు నెలల తర్వాత కేటీఆర్ స్పందించడంతో బీజేపీ నేతలు ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, తాను డ్రగ్స్ తీసుకుంటానని గతంలో విమర్శలు చేశారని, తన గోళ్లు, వెంట్రుకలు అడిగారని, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని, ఏ డాక్టర్ వద్ద అయినా చెక్ చేసుకోవడానికి సిద్ధమని చెప్పారు. తాను ఏ దోషం లేకుండా బయటకు వస్తానని, అప్పుడు బండి సంజయ్ కరీంనగర్ చౌరస్తాలో తన చెప్పుతో తాను కొట్టుకుంటాడా అని ప్రశ్నించారు.
దీనిపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, నాయకురాలు డీకె అరుణ స్పందించారు. నీ గోర్లు, వెంట్రుకలు ఎవరికి కావాలి, నీకు డయబెటీస్ ఉంది కాబట్టి, అవసరం లేదని అర్వింద్ అన్నారు. బండి సంజయ్ కంటే ముందు, రేవంత్ రెడ్డికి కేటీఆర్ డ్రగ్స్ విషయమై సవాల్ చేశారని, నెలలు గడుస్తున్నా స్పందించకుండా, ఇప్పుడు మాట్లాడటం ఏమిటని నిలదీశారు. అయినా ఇప్పుటికైనా నీ అంతట నీకు క్లీన్ చిట్ తెచ్చుకుంటే మంచిది కదా అని సూచించారు. జీహెచ్ఎంసీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చారా అని ప్రశ్నించారు. వాటి గురించి మాట్లాడకుండా అవసరం రాని కిడ్నీ గురించి మాట్లాడుతావా అని నిలదీశారు.
బండి సంజయ్ లవంగాలు తింటారని, కానీ కేటీఆర్కు లవంగానికి, తంబాకుకు తేడా తెలియని మంత్రి అన్నారు. కేటీఆర్ పైన పదేపదే డ్రగ్ ఆరోపణలు వస్తున్నాయని, పైగా అతని స్నేహితులు ఇందులో చిక్కుకుపోయారని, కాబట్టి తాను స్వచ్చంధంగా ప్రజల ముందు క్లీన్ చిట్ తీసుకునే ప్రయత్నం చేయాలన్నారు. బండి సంజయ్ రెండేళ్ల కిందట సవాల్ చేస్తే, ఇప్పడు కేటీఆర్ స్పందించడం విడ్డూరంగా ఉందని, అప్పుడే నీ గోళ్లు, వెంట్రుకలు ఎందుకు ఇవ్వలేదని డీకే అరుణ ప్రశ్నించారు. కేటీఆర్ విదేశాలకు వెళ్లి డీ-అడిక్షన్ చికిత్స తీసుకొని వచ్చారని, శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఫేక్ సవాల్ విసురుతున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా డ్రగ్స్ తీసుకోకుంటే అప్పుడే స్పందించేవారన్నారు. ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటే వెంట్రుకలు, గోళ్లలో అనవాళ్లు రెండు నుండి మూడు నెలలు మాత్రమే ఉంటాయన్నారు.