Bihar:లో చూస్తుండగానే కూప్పకూలిన కేబుల్ బ్రిడ్జ్..సీఎం రాజీనామాకు డిమాండ్
బిహార్‌లో నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఆకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీహార్‌లోని ఖగారియాలో నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తంగంజ్ వంతెన అందరూ చూస్తుండగానే ఆదివారం సాయంత్రం కూలిపోయింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ చక్కర్లు కోడుతున్నాయి. దీంతోపాటు అక్కడ ఉన్న స్థానికులు లైవ్ దృశ్యాలను కెమెరాలో బంధించారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ వంతెన కూలిపోవడం ఇది రెండోసారి కావడం విశేషం. మరోవైపు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులను గుర్తించాలని సంబంధిత అధికారులను కోరారు.
బీహార్‌లోని ఖగారియాలో రూ.1,700 కోట్ల వ్యయంతో అగువానీ సుల్తాన్‌గంజ్ గంగానదిపై వంతెనను నిర్మిస్తున్నారు. పిల్లర్ 2, 3 మధ్య 206 మీటర్ల పొడవు గల వంతెన ముందు భాగం కూలిపోయింది. గత ఏడాది ఏప్రిల్ 30న ఈ బ్రిడ్జిలో కొంత భాగం కూలిపోయింది. ఆ తర్వాత ఒక అధ్యయనం చేయడానికి నిర్మాణ విషయాలలో IIT రూర్కీని సంప్రదించారు. ఇంకా తుది నివేదిక రావాల్సి ఉంది. ఆ లోపే ఇలా జరగడం విశేషం. తుది నివేదిక కోసం వేచి ఉండకూడదని తాము నిర్ణయించుకున్నామని బ్రిడ్జ్ నిర్వహకులు తెలిపారు. వంతెన భాగాలను క్రిందికి లాగడానికి ప్రయత్నించామని వెల్లడించారు. ఈ చర్యలో భాగంగానే ఇలా జరిగిందని తెలిపారు.
మరోవైపు ఈ దుర్ఘటనపై బిహార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై బిహార్ బీజేపీ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వ పాలనలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఈ ఘటన తెలియజేస్తోందని చౌదరి అన్నారు.