జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం వారాహిపై రాద్దాంతం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడు, పదే పదే జనసేనానిని టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు వారాహిని టార్గెట్ చేస్తోంది. పవన్ వాహనం ఆలివ్ గ్రీన్‌లో ఉందని, ఇదీ మిలటరీ రంగులా ఉందని, కాబట్టి రిజిస్ట్రేషన్ కాదని వైసీపీ నేతలు మొదట చెప్పారు. కానీ అది ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని తేలింది. అంతేకాదు, తెలంగాణలో నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగడం లేదు. మంత్రులు, వైసీపీ నేతలు వారాహి వాహనాన్ని ఏపీలో అడుగుపెట్టనీయమన్న విధంగా మాట్లాడుతున్నారు.
పవన్ ఆ వాహనంలో అక్కడ తిరుగుతారేమోనని, అందుకే తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మంత్రి గుడివాడ అమర్నాద్ ఎద్దేవా చేశారు. ఏపీ నిబంధనల మేరకు ఆ వాహనం ఉంటేనే ఇక్కడ అనుమతిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి కాదని, నారాహి అని మరో మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. మంచి కంటెంట్ లేని సినిమాలాగే జనసేన కూడా ప్లాప్ షో అన్నారు. రెండు ఫోటోలు ట్విట్టర్లో పోస్ట్ చేసి, యుద్ధానికి రెడీ అని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పవన్ వీకెండ్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టి, పోటీ చేయకుండానే ఇతర పార్టీలకు ఓటు వేయమని చెప్పినప్పుడే ఆ పార్టీ అట్టర్ ఫ్లాప్ అన్నారు. అంబటి రాంబాబు వాహనం వద్ద నిలబడిన పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ, కిల్ బిల్ పాండే అని పేర్కొన్నారు.
వారాహిపై వైసీపీ విమర్శలకు జనసైనికులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు. నిబంధనల మేరకు లేకుండానే తెలంగాణలో వాహనం రిజిస్ట్రేషన్ ఎలా చేశారని, కావాలని వైసీపీ పవన్ కళ్యాణ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అది ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని చెబుతున్నారు. అసలు వారాహి రంగు గురించి మాట్లాడుతున్న వైసీపీ నేతలు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ గుర్తు వేసినప్పుడు, ఆరోగ్యశ్రీ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా రంగు మార్చారని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి వైసీపీ నిబంధనల గురించి మాట్లాడటం విడ్డూరమంటున్నారు.