ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో ఆడిన ఆయన.. ఈ నగరంపై అమితమైన ప్రేమ పెంచుకున్నారు. దానినే అభిమానం రూపంలో ఎప్పుడూ చూపిస్తూ ఉంటారు.
సందర్భం వచ్చినప్పుడల్లా భారత అభిమానులను ఇంప్రెస్ చేస్తూనే ఉంటాడు. అతను బ్యాట్ పట్టి మైదానంలో దిగిండంటే బౌలర్లకే కాదు, ఆటను చూసే అభిమానులకు కూడా ఊపిరి సలపనంత వేగంగా పరుగుల వరద పారిస్తుంటాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కరెంటు కంటే వేగవంతమైన కదలికలతో ఆకట్టుకుంటాడు.
అంతేగాక నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానుల దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. దాదాపు దశాబ్దానికిపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న వార్నర్‌కు భారత పండుగలపై మక్కువ పెరిగింది. అన్ని భారత పండుగలను వార్నర్ సెలెబ్రేట్ చేసుకుంటాడు. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వార్నర్ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపాడు.
ఇప్పుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఒక పోస్టును పెట్టాడు. ఆ పోస్టులో తాను వినాయకుడి ముందు నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేశాడు. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు, ఈ పండుగ మీ అందరికీ సుఖసంతోషాలు తెచ్చిపెట్టాలని ప్రార్థిస్తున్నా అని వార్నర్ పేర్కొన్నాడు.