రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వైమాస సమీక్ష సమావేశం(MPC) సోమవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు MPC అనంతరం బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రెపో రేటును వరుసగా పెంచుకుంటూ రావడంతో ఇప్పటికే 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఈసారి కాస్త తగ్గించి 35 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వేగంగా పెరుగుతూ వచ్చిన రెపో రేటు, ఇప్పుడు కాస్త నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అలాగే వడ్డీ రేట్లు దాదాపు చివరి అంకానికి చేరుకున్నాయని, ఈ సమయంలో నెమ్మదించవచ్చునని అంటున్నారు.
బ్లూమ్బర్గ్ సర్వేలో పాల్గొన్న 35 మంది ఆర్థికవేత్తల్లో 29 మంది ఈసారి రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెరగవచ్చునని అభిప్రాయపడ్డారు. 25 బేసిస్ పాయింట్లు పెరగవచ్చునని ముగ్గురు, 10, 30, 50 బేసిస్ పాయింట్లు పెరగవచ్చునని ఒక్కరు చొప్పున తెలిపారు. ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు, ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో ఆర్బీఐ రెపో రేటు పెంపు కూడా నెమ్మదించవచ్చునని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్బీఐ రీసెర్చ్ కూడా రెపో రేటు ఈసారి 35 బేసిస్ పాయింట్లు ఉండవచ్చునని పేర్కొంది.