మెక్సికో(Mexico)లో మరోసారి షూటౌట్ జరిగింది. ఉత్తర మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో శనివారం జరిగిన కార్ షోలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 10 మంది రోడ్ రేసర్లు మరణించగా..మరో తొమ్మిది మంది గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాకు ఆనుకుని ఉండగా.. డ్రగ్స్ స్మగ్లింగ్‌కు ఇది ప్రసిద్ధి చెందినదని చెబుతున్నారు. ఎన్సెనాడా నగరంలోని శాన్ విసెంటే ప్రాంతంలో ఆల్ టెరైన్ కార్ రేసింగ్ షో సందర్భంగా ఈ దాడి జరిగింది.
పొడవాటి తుపాకీలతో ఉన్న వ్యక్తులు బూడిద రంగు వ్యాన్ నుంచి దిగి గ్యాస్ స్టేషన్లో పాల్గొనేవారిపై కాల్పులు చేశారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర అటార్నీ జనరల్ రికార్డో ఇవాన్ కార్పియో సాంచెజ్ ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు తెలిపారు.