లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఓ సబ్ ఇన్పెక్టర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అసోంకు చెందిన మహిళా ఎస్ఐ జున్మణి రభా ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొంది. సమాచారం అందుకున్న నాగాన్ జిల్లా జఖలబాంధా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జున్మణి రభాను హాస్పిటల్ తరలిస్తుండగా మాధ్యలోనే ప్రాణాలు విడిచిందన్నారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
జున్మణి మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్ట్ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి తన ప్రైవేట్ కారులో ప్రయాణిస్తున్నారు. అర్థరాత్రి 2.30 గంటలకు ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ జున్మణి ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సివిల్ డ్రెస్ లో ఉన్న జున్మణిని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే లేడీ సింగం ప్రాణాలు విడిచిందని డాక్టర్లు తెలిపారు. యాక్సిడెంట్ అయిన తర్వాత ట్రక్కు డ్రైవర్ పరారైనట్లు పోలీసులు తెలిపారు.
జున్మణి పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అవినీతి ఆరోపణలపై కొంతకాలం ఆమె సస్పెన్షన్ లో ఉన్నారు. ఇటీవలే డ్యూటీలో జాయిన్ అయ్యారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందే జున్మనిపై దోపిడీ కేసు నమోదూనట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆవిడ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా చేయాలని కోరారు.