గతేడాది రిపబ్లిక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. అయితే ఆ సమయంలో సాయి ధరమ్ యాక్సిడెంట్‌కు గురవడంతో.. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే కాస్త గ్యాప్ తర్వాత సినిమా చేస్తున్నాడు తేజ్. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు సాయి ధరమ్. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాంతార సినిమాతో గూస్ బంప్స్ తెప్పించిన అంజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. భీమ్లా నాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇక తేజ్ కెరీర్లో 15వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో.. డిసెంబర్ 7న ఈ సినిమా టైటిల్, టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ చేతుల మీదుగా టీజర్ లాంఛ్ చేయబోతున్నారట. తారక్‌కు మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. ఇటివలే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే తేజ్ సినిమాను ఎన్టీఆర్ ప్రమోట్ చేయబోతున్నాడని చెప్పొచ్చు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తంగా.. ఈ విషయంలో మరోసారి మెగా, నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.