మహారాష్ట్రలోని అకోలాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఘర్షణల్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఎనిమిది మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకుని… వెంటనే 144 సెక్షన్ విధించారు. అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్టేషన్ పరిధిలో ఘర్షనలు మొదలైన వెంటనే.. ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాయి.
“ఒక వ్యక్తి మరణించాడు, ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసులు ఉన్నారు, అల్లర్లు జరిగి రాళ్లు రువ్వడంతో ఈ పరిస్థితి నెలకొంది” అని అకోలా ఎస్పీ సందీప్ ఘుగే తెలిపారు. హింసాకాండలో మరణించిన వ్యక్తిని విలాస్ గైక్వాడ్‌గా గుర్తించామని, అతని బంధువులు, అల్లుడు మోహన్ కిషన్ గోండ్వాలే ఫిర్యాదు చేశారని, మేము దానిని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
శనివారం అర్థరాత్రి అకోలా పోలీస్టేషన్ కు సమీపంలో ఇరువర్గాలు గుమిగూడాయి. ఇన్స్టాగ్రామ్ లో ఒక మతనాయకుడి గురించి మరో వర్గంవారు తప్పుడుగా పోస్ట్ చేశారని ఆరోపించుకున్నారు. మాట మాటా పెరిగి అల్లర్లకు దారితీసిందని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నగరంలోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144ను విధించాలని జిల్లా మేజిస్ట్రేట్ నీమా అరోరా ఆదేశించారు.
“రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి, వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, వాహనాలను తగులబెట్టారు. మూడు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 144 కూడా విధించబడింది. ఎనిమిది మంది గాయపడ్డారు, హింసను నియంత్రించడానికి తక్షణమే పోలీసు చర్యలు తీసుకున్నారు” అని అకోలా SP సందీప్ ఘుగే అన్నారు.
పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ, జనం పెద్దఎత్తున ఆందోళనకు దిగి వాహనాలను ధ్వంసం చేయడం, రాళ్లు రువ్వడం, నిప్పంటించడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. దాదాపు 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు తీవ్రప్రయత్నం చేశారు. గంగాధర్ చౌక్, పోలా చౌక్, హరిహర్ పేట సమీపంలోని ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. అల్లర్లలో ఒక పోలీసు వ్యాన్ దెబ్బతింది. కొంతమంది పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు, అల్లర్లను అదుపుచేయడానికి పోలీసులు టియర్‌గ్యాస్ ను ఆశ్రయించారు.
“రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ చెలరేగింది. పోలీసు బలగాలు తక్షణమే స్పందించాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది. శాంతిని కాపాడాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము” అని అకోలా ఎస్పీ సందీప్ ఘుగే అన్నారు. అకోలా జిల్లా, వాషిం, బుల్దానా, అమరావతి గ్రామీణ ప్రాంతాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించారు. ఇప్పటి వరకు హింసకు పాల్పడిన 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో నగరంలో భారీ భద్రతను మోహరించినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) మోనికా రౌత్ రౌత్ తెలిపారు. అమరావతి నుంచి వెయ్యి మంది స్టేట్ రిజర్వ్ పోలీస్ సిబ్బందిని అకోలా నగరంలో మోహరించినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, భయాందోళనలకు గురికావద్దని పోలీసులు పౌరులకు విజ్ఞప్తి చేశారు.
దేవేంద్ర ఫడ్నవీస్ మానిటరింగ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అకోలా జిల్లా సంరక్షక మంత్రి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“అకోలా ఘటనకు సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ గత రాత్రి నుంచి డీజీపీతో పాటు అకోలా పోలీసులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది, శాంతిభద్రతలు నెలకొని ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 30 మంది నిందితులను అరెస్టు చేశారు, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.