కాంగోలో నదుల నుంచి ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగింది. వందల ఇళ్లు నెలమట్టం కాగా..ఇప్పటివరకు 203 మంది మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(Congo)లో నదుల నుంచి ఆకస్మాత్తుగా వరదలు(Floods) రావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య 203 మందికి చేరుకుందని, వరదల కారణంగా బురదల్లో చిక్కుకున్న మరిన్ని మృతదేహాలను వెలికితీస్తున్న అక్కిడి అధికారులు తెలిపారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయిన న్యాముకుబి గ్రామంలో రెస్క్యూ కార్మికులు శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకుతున్నరని చెప్పారు.
దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు బోరున విలపిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు తమ కుటుంబాల కోసం గాలింపు చేస్తున్నారు. దీంతోపాటు పొరుగువారిని చాలా మందిని కోల్పోయామని పలువురు చెబుతున్నారు. ఊరంతా బీడుగా మారిపోయిందని, రాళ్లు మాత్రమే మిగిలాయని అంటున్నారు. ప్రస్తుతం మా భూమి ఎక్కడ ఉందో కూడా చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గురువారం కివు సరస్సు ఒడ్డుకు సమీపంలోని కలేహే భూభాగంలోని గ్రామాలలో నదులు(rivers)ఉగ్రరూపం దాల్చాయి. దీంతో అనేక మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఆకస్మిక వరదలు చాలా వేగంగా వచ్చాయని, అవి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పారు. అప్రమత్తమైన అధికారులు ఆహార సామాగ్రిని పంపడంతోపాటు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు వర్షాల కారణంగా ప్రభావిత ప్రాంతానికి వెళ్లే పలు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని అన్నారు.
మరోవైపు ఇటీవలి రోజుల్లో భారీ వర్షాలు తూర్పు ఆఫ్రికాలో వేలాది మందికి కష్టాలను తెచ్చిపెట్టాయి. ఉగాండా, కెన్యాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షలు సంభవించాయి. అయితే కాంగోలో మాత్రం నదుల వల్ల నష్టం జరగడం ఇది నాలుగోసారి.