»Karnataka Election 2023 This Election Is Not About You Rahul Gandhi Tells Pm In Poll Bound Karnataka
Rahul Gandhi: ఈ ఎన్నికలు మీ గురించి కాదు.. మోదీకి రాహుల్ సెటైర్లు..!
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్లాన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలు కూడా హీటెక్కిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఆ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్లాన్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాలు కూడా హీటెక్కిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 40 సీట్లకు మించి రాకుండా చూడాలని, కాంగ్రెస్ ని 150 స్థానాల్లో గెలిపించాలని ఆయన కోరారు. తమ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. బీజేపీ.. ఎమ్మెల్యేలకు డబ్బులు పంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ అంటే.. కర్ణాటకలో అవినీతి మాత్రమే గుర్తుకొస్తుందని విమర్శలు గుప్పించారు. కర్ణాటక ప్రజలు ఈ బీజేపీ ప్రభుత్వాన్ని 40 శాతం ప్రభుత్వం అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని కాంట్రాక్టర్ల నుంచి బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ లాక్కుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ అడుగుతోందని కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ప్రధానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం తన దగ్గర 30 శాతం కమీషన్ తీసుకుంటోందని.. ఓ పూజారి కూడా ఆరోపించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ బీజేపీ అవినీతికి పాల్పడిందని తీవ్ర ఆరోణలు చేశారు. కర్నాటక ప్రజలను ఓట్లు అడిగే ముందు.. అవినీతిని అరికట్టేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని.. రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఏ వ్యక్తికి సంబంధించిన ఎన్నికలు కాదని.. ప్రధాని పదవి కోసం కాదనే విషయాన్ని.. ప్రధానమంత్రి అర్థం చేసుకోవాలని హితవు పలికారు.
“గోవా, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య ఉన్న నీటి వివాదాన్ని పరిష్కరించేందుకు బీజేపీ ఏం చేసిందన్న విషయంపై ప్రధాని మోదీ మాట్లాడాలి. కర్ణాటకలో అవినీతిని రూపుమాపేందుకు ఏం చేశామన్న విషయంపై మోదీ మాట్లాడాలి. అంతేగానీ, తన గురించి తాను మాట్లాడుకోవడం కాదు. ఎన్నికల ర్యాలీల్లో కాస్త బీజేపీలోని ఇతర నేతల గురించి కూడా మాట్లాడండి” అని రాహుల్ గాంధీ చురకలు అంటించారు. “ఈ మూడేళ్లలో కర్ణాటకకు ఏం చేశారు మోదీ జీ? కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల వద్ద ఘర్షణలు జరిగినప్పుడు మీరేం చేశారు? కర్ణాటక-గోవా-మహారాష్ట్ర నీటి సమస్య పరిష్కారానికి మీరు చేసిందేంటీ? కర్ణాటకలో వరదలు వచ్చినప్పుడు ఏ సాయం చేశారు? కర్ణాటక అభివృద్ధి కోసం ఏం చేశారో ఏదైనా చెప్పండి” అంటూ రాహుల్ గాంధీ నిలదీశారు.