అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా సైబర్ నేరాలు(Cyber Crimes) మాత్రం ఆగడం లేదు. సులభంగా డబ్బులు(Easy Money) సంపాదించాలనే అత్యాశతో చాలా మంది ఈ దారిని ఎంచుకుంటున్నారు. టెక్నాలజీ(Technology)ని వాడుకుని సైబర్ నేరాగాళ్లు(Cyber Criminals)గా మారుతున్నారు. సైబర్ మోసాలకు పాల్పడుతూ ఎందరో ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్ల మాయలో పడిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి(Software Employee) తన ప్రాణాలను కోల్పోయిన ఘటన సంచలనం రేపింది.
సంగారెడ్డికి చెందిన అరవింద్(Aravind) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఆ ఉద్యోగంతో పాటుగా టెలిగ్రామ్లో వచ్చిన ఓ లింకు(Telegram Link) ద్వారా వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నాడు. టెలిగ్రామ్ లో ఇచ్చిన టాస్కుల ఆధారంగా డబ్బులు పొందుతున్నాడు. అందులో రూ.200 ఇన్వెస్ట్ చేస్తే రూ.250లను సైబర్ నేరస్తులు(Cyber Criminals) పంపారు. డబ్బులు రావడంతో అరవింద్ లో అత్యాశ ప్రారంభమైంది. ఆ అత్యాశ అతన్ని ఏకంగా రూ.12 లక్షల వరకూ ఆన్ లైన్లో పెట్టుబడులు(Online Invest) పెట్టేలా చేసింది.
రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత సైబర్ నేరస్తుల(Cyber Criminals) నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో అరవింద్ ఆందోళన చెందాడు. టాస్కులు పూర్తి చేసినా కూడా రూపాయి కూడా రాలేదు. వచ్చే నెల 5వ తేదిన అరవింద్ చెల్లి పెళ్లి కూడా ఉంది. ఇంట్లో ఖర్చులకు దాచిన డబ్బులు సైతం అరవింద్ వాడుకున్నాడు. ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఓ వైపు అప్పులు, మరోవైపు చెల్లి పెళ్లికి డబ్బులు లేకపోవడంతో బుధవారం ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో ఉరి వేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.